Iran-US Talks: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య అమెరికా–ఇరాన్ చర్చలు మరోసారి ప్రారంభమవుతున్నాయి. ఇస్లామాబాద్ వేదికగా జరగనున్న ఈ చర్చల్లో ఈసారి ఇరాన్ నేరుగా అమెరికాతో మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ స్పష్టం చేసింది. దీంతో ఈ చర్చలు అంతర్జాతీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ నేతృత్వంలోని బృందం ఇప్పటికే పాకిస్థాన్ చేరుకుంది. అయితే గత చర్చల మాదిరిగా ప్రత్యక్ష సమావేశాలు ఉండవని టెహ్రాన్ వెల్లడించింది. ఇరుదేశాల ప్రతినిధుల మధ్య సందేశాలను పాకిస్థాన్ అధికారులు మధ్యవర్తిత్వం ద్వారా చేరవేస్తారని ఇరాన్ విదేశాంగ శాఖ తెలిపింది.
ఇరాన్ అధికార ప్రతినిధి ప్రకారం, అమెరికాకు చెప్పాల్సిన విషయాలను పాక్ అధికారుల ద్వారానే వెల్లడిస్తామని పేర్కొన్నారు. మరోవైపు, వైట్ హౌస్ మాత్రం ప్రత్యక్ష చర్చలు జరుగుతాయని ముందుగా ప్రకటించగా, ఇప్పుడు పరిస్థితి మారినట్లు స్పష్టమైంది.
ఈ చర్చల్లో అమెరికా తరఫున అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్ పాల్గొనే అవకాశం ఉంది. చర్చల్లో పురోగతి కనిపిస్తే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా చేరవచ్చని సమాచారం. అయితే ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘాలిబఫ్ ఈసారి చర్చలకు దూరంగా ఉండటం గమనార్హం.
ఇదిలా ఉండగా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా షరతులకు అనుగుణంగా ఇరాన్ స్పందిస్తేనే ఒప్పందం సాధ్యమని స్పష్టం చేశారు. ముఖ్యంగా శుద్ధి చేసిన యురేనియాన్ని వదులుకోవడం, హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలను పునరుద్ధరించడం వంటి డిమాండ్లను మరోసారి గుర్తుచేశారు.
ప్రస్తుతం ఈ చర్చలు ఏ దిశగా మలుపుతిప్పుతాయన్నది ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠగా మారింది.