Instagram purge: ఇన్‌స్టాగ్రామ్ భారీ స్థాయిలో చేపట్టిన క్లీనప్ డ్రైవ్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. 2026 సంవత్సరానికి గాను ప్లాట్‌ఫామ్ “గ్రేట్ పర్జ్” పేరుతో లక్షలాది బాట్ మరియు ఇనాక్టివ్ ఖాతాలను తొలగించింది. ఈ చర్యతో ప్రపంచవ్యాప్తంగా అనేక సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, బ్రాండ్ల ఫాలోవర్ల సంఖ్య ఒక్కసారిగా భారీగా తగ్గిపోయింది.
పాప్‌బేస్ నివేదికల ప్రకారం, ఈ క్లీనప్ ప్రభావం ప్రముఖులపై తీవ్రంగా పడింది. అమెరికన్ సోషల్ మీడియా స్టార్ కైలీ జెన్నర్ ఏకంగా 14 మిలియన్లకు పైగా ఫాలోవర్లను కోల్పోయినట్లు సమాచారం. మరికొందరు ప్రముఖులు కూడా గణనీయమైన ఫాలోవర్ నష్టాన్ని ఎదుర్కొన్నారు. దీంతో నెటిజన్లు ఈ పరిణామాన్ని “గ్రేట్ పర్జ్ ఆఫ్ 2026”గా పేర్కొంటున్నారు.
ఈ అంశంపై ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా ప్రతినిధి స్పందించారు. ఇది ప్లాట్‌ఫామ్‌లో నిజమైన యాక్టివ్ యూజర్లను ప్రోత్సహించేందుకు చేపట్టే సాధారణ ప్రక్రియ అని ఆయన తెలిపారు. ఇనాక్టివ్ మరియు నకిలీ ఖాతాలను తొలగించడం వల్లే ఫాలోవర్ల సంఖ్యలో మార్పులు కనిపించాయని, నిజమైన యూజర్లపై ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేశారు.
ఆసక్తికరంగా ఇన్‌స్టాగ్రామ్ అధికారిక ఖాతా కూడా ఈ క్లీనప్ నుంచి మినహాయింపు పొందలేదు. అధికారిక ఖాతా సైతం దాదాపు 9 మిలియన్ల ఫాలోవర్లను కోల్పోయినట్లు సోషల్ మీడియాలో స్క్రీన్‌షాట్లు వైరల్ అవుతున్నాయి. ఈ పరిణామం సోషల్ మీడియా ప్రపంచంలో పెద్ద చర్చకు దారి తీసింది.








