Indonesia Accident: ఇండోనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సుమత్రా ఐలాండ్‌లో బుధవారం మధ్యాహ్నం ప్యాసింజర్ బస్సు మరియు ఆయిల్ ట్యాంకర్ ట్రక్ ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో మొత్తం 16 మంది సజీవ దహనమయ్యారు.
లుబుక్లింగ్‌గౌ నగరం నుంచి జాంబీకి వెళ్తున్న ప్రైవేట్ బస్సులో ప్రయాణికులు ఉన్న సమయంలో బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.
ప్రమాదాన్ని నివారించేందుకు డ్రైవర్ బస్సును దారిమళ్లించే ప్రయత్నం చేసినప్పటికీ, అదే సమయంలో ఎదురుగా వేగంగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ బస్సును ఢీకొట్టింది. దీంతో ఇంధనం లీక్ అయి భారీ మంటలు వ్యాపించాయి.
ఈ ప్రమాదంలో 13 మంది బస్సు ప్రయాణికులు, బస్సు డ్రైవర్, ట్యాంకర్ డ్రైవర్ మరియు అతని సహాయకుడు మృతి చెందారు. మరో నలుగురు ప్రాణాలతో బయటపడగా, వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం 20 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
స్థానిక విపత్తు నిర్వహణ అధికారులు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రమాద స్థలం వద్ద బస్సు, ట్యాంకర్ పూర్తిగా కాలిపోయిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇండోనేషియాలో రోడ్డు భద్రతా ప్రమాణాలు తక్కువగా ఉండటం వల్ల ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ: Natural Star Nani | నాని ఫ్యాన్స్‌కు షాక్ …సినిమా ఆలస్యం








