US Student Visa: అమెరికాలో ఉన్నత విద్యను లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ విద్యార్థులకు తాజా గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. స్టూడెంట్ వీసాల జారీలో గణనీయమైన తగ్గుదల నమోదవడంతో విదేశాల్లో చదువుకోవాలనుకునే వారి ప్రణాళికలపై ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ (CIS) విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2025లో భారతీయులకు జారీ చేసిన స్టూడెంట్ వీసాల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 62 శాతం తగ్గింది. 2024లో 58,694 వీసాలు మంజూరు చేయగా, 2025లో ఆ సంఖ్య 22,149కు పరిమితమైంది. చైనా విద్యార్థుల విషయంలో కూడా తగ్గుదల నమోదై, వీసాల జారీ 61,075 నుంచి 40,034కు పడిపోయింది. ఇది 34 శాతం తగ్గుదలగా నివేదిక పేర్కొంది.
అయితే వీసాల జారీ తగ్గినా, అమెరికాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు. 2024-25 విద్యా సంవత్సరంలో 3.63 లక్షల మంది భారతీయులు, 2.65 లక్షల మంది చైనా విద్యార్థులు అమెరికాలో విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు. అదే నివేదికలో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) విధానంపై కూడా అభ్యంతరం వ్యక్తమైంది. OPT కార్యక్రమం ద్వారా 2024-25లో ఉద్యోగాలు పొందిన అంతర్జాతీయ విద్యార్థుల్లో 49 శాతం వాటా భారతీయులదేనని నివేదిక పేర్కొంది. ఈ విధానం స్థానిక అమెరికన్ ఉద్యోగార్థుల అవకాశాలపై ప్రభావం చూపుతోందని పేర్కొంటూ, OPT కార్యక్రమాన్ని పునఃసమీక్షించాలని సీఐఎస్ సూచించింది.
ALSO READ: UPI digital payment | UPI వినియోగదారులకు అలర్ట్.. కేంద్రం కొత్త నిర్ణయం ఇదే!








