UPI-NPI integration: భారతదేశం మరియు నేపాల్ మధ్య డిజిటల్ చెల్లింపుల రంగంలో ఒక కీలక ముందడుగు పడింది. రెండు దేశాలు కలిసి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ను నేపాల్ యొక్క నేషనల్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (NPI) తో అనుసంధానిస్తూ కొత్త వ్యవస్థను అధికారికంగా ప్రారంభించాయి. ఈ సదుపాయం ద్వారా సరిహద్దులు దాటి తక్షణ డిజిటల్ డబ్బు బదిలీలు సాధ్యమవుతాయి.
ఈ అనుసంధానం సాంకేతికంగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అంతర్జాతీయ విభాగమైన NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (NIPL) మరియు నేపాల్ క్లియరింగ్ హౌస్ లిమిటెడ్ (NCHL) సంయుక్తంగా పూర్తి చేశాయి. దీని ద్వారా రెండు దేశాల పౌరులు మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లు, డిజిటల్ వాలెట్లను ఉపయోగించి సులభంగా నిధులు పంపించుకోవచ్చు.
ప్రయాణికులకు ఈ వ్యవస్థ పెద్ద ఊరటగా మారనుంది. ఇకపై నగదు వెంట తీసుకెళ్లాల్సిన అవసరం తగ్గిపోవడంతో పాటు కరెన్సీ మార్పిడి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. తక్షణమే లావాదేవీలు పూర్తవడం వల్ల టూరిజం, వ్యాపార రంగాల్లో వేగవంతమైన చెల్లింపులు సాధ్యమవుతాయి. నేపాల్‌లోని స్థానిక వ్యాపారులకు కూడా ఈ అనుసంధానం ప్రయోజనం చేకూర్చనుంది.
భారత్‌లో ఉన్న భారీ UPI వినియోగదారుల మార్కెట్‌కు చేరువ కావడంతో వారి వ్యాపార లావాదేవీలు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో నగదు నిర్వహణ ఖర్చులు తగ్గి, డిజిటల్ లావాదేవీలు మరింత సురక్షితంగా మారుతాయి. ప్రస్తుతం UPI సేవలు సింగపూర్, యూఏఈ, ఫ్రాన్స్, మారిషస్, భూటాన్, ఖతార్, శ్రీలంక, కంబోడియా వంటి దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ జాబితాలో నేపాల్ చేరడంతో భారత్ డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థ అంతర్జాతీయ స్థాయిలో మరింత బలపడింది.








