Hyderabad Heat Wave: గ్లోబల్‌గా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో నగర జీవనం తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ నగరంపై ఆందోళనకర విషయాలు వెలుగుచూశాయి. తీవ్ర ఉష్ణోగ్రతల ప్రభావానికి అత్యధికంగా గురయ్యే ప్రపంచంలోని 30 ప్రధాన నగరాల జాబితాలో హైదరాబాద్ కూడా చోటు దక్కించుకుంది.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన తాజా అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. “మూవింగ్ బియాండ్ ఎక్స్‌పోజర్” పేరుతో నిర్వహించిన ఈ పరిశోధనలో ప్రపంచవ్యాప్తంగా 205 ప్రధాన నగరాలను విశ్లేషించారు. కేవలం ఉష్ణోగ్రతల తీవ్రతనే కాకుండా, నగరాల్లోని పచ్చదనం, కూలింగ్ సదుపాయాలు, జనాభా సాంద్రత, అలాగే ప్రజల సామాజిక-ఆర్థిక పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకుని హీట్ వల్నరబిలిటీ ఇండెక్స్ రూపొందించారు.
ఈ సూచీలో కోట్లకు పైగా జనాభా ఉన్న హైదరాబాద్‌కు 0.68 స్కోర్ లభించింది. ఈ జాబితాలో కైరో, మనీలా వంటి ప్రపంచ నగరాలతో పాటు హైదరాబాద్ కూడా ఉండటం గమనార్హం. భారత్‌లోని ఇతర నగరాలతో పోలిస్తే అహ్మదాబాద్, నాగ్‌పూర్, మదురై వంటి నగరాల్లో ఉష్ణ ముప్పు ఇంకా ఎక్కువగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. అయితే ముంబై, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వంటి నగరాల పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నట్లు పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణ ముప్పు ఉన్న టాప్-50 నగరాల్లో భారత్‌కు చెందిన 14 నగరాలు ఉండటం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. ఇది భవిష్యత్తులో పట్టణ జీవనంపై పెద్ద ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ ఏడాది వేసవిలో హైదరాబాద్ నగరం కూడా తీవ్రమైన ఎండలను ఎదుర్కొంది. ఏప్రిల్ 1 నుంచి జూన్ 5 వరకు దాదాపు 47 రోజుల పాటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదయ్యాయి. వేగంగా జరుగుతున్న నగర విస్తరణ, పచ్చదనం తగ్గిపోవడం, కూలింగ్ సదుపాయాల కొరత వంటి అంశాలు పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తున్నాయని పరిశోధకులు పేర్కొన్నారు.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నగరాల్లో పచ్చదనాన్ని పెంచడం, చెట్ల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వడం, ప్రజలకు అందుబాటులో కూలింగ్ సెంటర్ల ఏర్పాటు చేయడం, అలాగే పర్యావరణ అనుకూల పట్టణ ప్రణాళికలను అమలు చేయడం అత్యవసరమని ఈ అధ్యయనం సూచిస్తోంది.
Hyderabad Heat Wave | హైదరాబాద్‌కు హీట్ అలర్ట్.. ప్రపంచంలో టాప్ 30 ప్రమాద నగరాల్లో స్థానం
-








