Google: గూగుల్ సంస్థ దోమల వల్ల వ్యాప్తి చెందే రోగాలను అరికట్టేందుకు ఒక కొత్త తరహా ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారు 6.4 కోట్ల ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన దోమలను అమెరికాలోని ఫ్లోరిడా, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో విడుదల చేయాలని ప్రణాళిక రూపొందించింది. ఈ ప్రయోగానికి సంబంధించి గూగుల్ సంస్థ అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ (EPA) అనుమతి కోసం ఎదురుచూస్తోంది. అనుమతి లభిస్తే వచ్చే రెండేళ్లలో దశలవారీగా ఈ దోమలను వాతావరణంలోకి విడుదల చేయనున్నారు.
ఈ ప్రాజెక్టులో భాగంగా వోల్బాచియా అనే సహజ బ్యాక్టీరియాతో మార్పు చేసిన మగ దోమలను ఉపయోగించనున్నారు. ఈ మగ దోమలు అడవిలో ఆడ దోమలతో కలిసినప్పుడు వచ్చే గుడ్లు ఫలదీకరణ చెందవని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీని ద్వారా వ్యాధికారక దోమల జనాభా తగ్గే అవకాశం ఉంది. గూగుల్ ఈ కార్యక్రమాన్ని “డీబగ్” (Debug) ప్రాజెక్ట్ కింద 2014 నుంచే అభివృద్ధి చేస్తోంది.
రసాయనాలు లేదా క్రిమిసంహారకాలు ఉపయోగించకుండా సహజ బయోలాజికల్ విధానంలో దోమలను నియంత్రించడమే దీని ప్రధాన లక్ష్యం. కేవలం ఆడ దోమలు మాత్రమే మనుషులను కుడుతాయి. ఈ ప్రాజెక్టులో విడుదల చేసే మగ దోమలు కాటు వేయవు కాబట్టి మానవులకు నేరుగా ప్రమాదం ఉండదని గూగుల్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మలేరియా, డెంగ్యూ, జికా, చికున్‌గునియా, ఎల్లో ఫీవర్ వంటి ప్రాణాంతక వ్యాధులు దోమల వల్లే వ్యాపిస్తాయి.
ఈ నేపథ్యంలో ఈ ప్రయోగం విజయవంతమైతే ప్రపంచంలోనే అతిపెద్ద దోమల నియంత్రణ ప్రాజెక్టుగా నిలవనుంది. అయితే లక్షల సంఖ్యలో ల్యాబ్ దోమలను విడుదల చేయడంపై కొంతమంది నిపుణులు పర్యావరణ ప్రభావాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన EPA పరిశీలనలో ఉండగా, ప్రజల అభిప్రాయాలను కూడా సేకరిస్తున్నారు.








