ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తర్ కాశీలో దారుణ ఘటన జరిగింది. గంగా నది ఒడ్డున రీల్స్ కోసం వినూత్న యాంగిల్స్‌తో వీడియో తీసేందుకు ప్రయత్నించిన ఓ యువతి ప్రమాదవశాత్తు ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఆమెను స్థానికులు గమనించినప్పటికీ.. భారీ ప్రవాహం కారణంగా కాపాడలేకపోయారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అప్పటికే యువతి మృతదేహం కొంతదూరంలో లభించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధిత యువతి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
సోషల్ మీడియా ప్రాధాన్యత పెరిగిన కొద్ది వినూత్న రీల్స్ కోసం చాలా మంది ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారు. వాటికి లైక్స్, వ్యూస్ పెరిగితే సరిపోతుందనుకుంటున్నారు. కానీ కొన్ని సార్లు చిన్న పొరపాటే భారీ ప్రాణనష్టానికి దారితీస్తోంది. ఇదే విషయాన్ని నెటిజన్లు గమనిస్తూ బాధను వ్యక్తం చేస్తున్నారు.
“నీళ్లతో పరాచకాలు ఆడితే ఇంతే..”, “రీల్స్ కోసం ఇంత వెర్రిగా ప్రవర్తించకూడదు”, “ప్రాణాలు అర్థం చేసుకోరు ఈ జనాలు” అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది. ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకూడదంటే యువత సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.