భారత్-అమెరికా ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)కు వ్యతిరేకంగా రైతు సంఘాలు చేపట్టిన “ఢిల్లీ చలో”(Delhi Chalo March) ఉద్యమం పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. పంజాబ్‌లోని పలు ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో రైతులు శంభూ సరిహద్దుకు చేరుకుని ఢిల్లీలో నిర్వహించనున్న మహా పంచాయత్‌లో పాల్గొనేందుకు ప్రయత్నించారు. అయితే వారిని హర్యానా పోలీసులు సరిహద్దు దాటకుండా అడ్డుకున్నారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు వంతెనలపై కాంక్రీట్ బారికేడ్లు, సిమెంట్ బ్లాకులు, ముళ్లకంచెలు ఏర్పాటు చేయడంతో పాటు భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అవసరమైతే వాటర్ కేనన్లను వినియోగించేందుకు కూడా సిద్ధంగా ఉంచారు.
అమెరికాతో కుదరనున్న వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తే చవక ధరల డెయిరీ, వ్యవసాయ ఉత్పత్తులు భారత మార్కెట్‌లోకి పెద్ద ఎత్తున దిగుమతి అవుతాయని రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే చిన్న, సన్నకారు రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతు నాయకులు హెచ్చరిస్తున్నారు. తమ నిరసనను అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని రైతు నాయకులు ఆరోపించారు.
మరోవైపు ఢిల్లీలోనూ పోలీసులు అప్రమత్తమై సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. రైతుల ఆందోళనలతో రాజధాని పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
ALSO READ: Gold Prices Today | బంగారం కొనుగోలుదారులకు షాక్.. మళ్లీ పెరిగిన గోల్డ్ రేట్లు, తాజా ధరలు ఇవే!








