కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడిచినా పేదలకు ఇళ్ల స్థలాల మంజూరులో ఎలాంటి పురోగతి లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి. ఈశ్వరయ్య విమర్శించారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలాలు ఇచ్చి, ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందించాలనే డిమాండ్‌తో విజయనగరం తహశీల్దార్ కార్యాలయం వద్ద సీపీఐ నేతలు సోమవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా మార్క్స్ నగర్ నుంచి పట్టణ వీధుల్లో సీపీఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. మొదటి విడతగా కొందరు లబ్దిదారుల దరఖాస్తులు ఇచ్చామని, మిగిలినవి రెండో విడతలో సమర్పిస్తామని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ, జిల్లా సహాయ కార్యదర్శి అలమండ ఆనందరావు, ఎస్. రంగరాజు, ఎన. నాగభూషణం, బల్జి వీధి శాఖ కార్యదర్శి పొందూరు అప్పలరాజు, ఏఐటీయూసీ నాయకులు పొడుగు రామకృష్ణ, అల్తి మరయ్య తదితరులు పాల్గొన్నారు.
పేదల ఇళ్ల కలను నిజం చేసేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఇళ్ల స్థలాలపై స్పష్టమైన విధానం ప్రకటించాల్సిందేనని సీపీఐ నేతలు హెచ్చరించారు. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉగ్ర నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు వెల్లడించారు.