Uttar Pradesh Assembly Elections: దేశ రాజకీయాల్లో కీలకంగా మారనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. బీజేపీని ఎదుర్కొనేందుకు ఇండియా కూటమిని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో పాటు ఉత్తరప్రదేశ్‌కు చెందిన పలువురు ముఖ్య నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో యూపీలో తాజా రాజకీయ పరిణామాలు, ఎన్నికల వ్యూహాలు, సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు, సీట్ల పంపకాలపై ప్రధానంగా చర్చించినట్లు ఖర్గే వెల్లడించారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు, అణగారిన వర్గాలకు తగిన ప్రాధాన్యత కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్, ఇండియా కూటమి రాష్ట్రంలో బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతాయని ధీమా వ్యక్తం చేశారు.
మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ 181 స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ కూడా 181 స్థానాలపై పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఆసక్తికరంగా మారింది. ఈ అంశంపై లక్నోలో జరగనున్న చర్చలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదిలా ఉంటే, ఇండియా కూటమి నుంచి బయటకు వెళ్లే ప్రసక్తే లేదని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో కలిసి బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. మొత్తానికి యూపీ ఎన్నికల సమరానికి ముందే కాంగ్రెస్, ఎస్పీ మధ్య సీట్ల లెక్కలు మొదలయ్యాయి. చర్చల అనంతరం ఏ పార్టీకి ఎన్ని స్థానాలు దక్కుతాయో, కూటమి ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ALSO READ: Apple Health AI Study | వైద్య సలహాలకు ఏఐనా? ఆపిల్ సంచలన పరిశోధన!
