Bharat Summit 2026: హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సు ఇప్పుడు రాజకీయ వివాదానికి కేంద్రంగా మారింది. భారత్ సమ్మిట్ వేదికగా విదేశీ రాజకీయ ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలు దేశ గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయంటూ తెలంగాణ బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు నేతృత్వంలోని బీజేపీ బృందం శంషాబాద్‌లోని విదేశీయుల ప్రాంతీయ నమోదు కార్యాలయం (FRRO) అధికారులకు ఫిర్యాదు చేసింది. నవంబర్ 12 నుంచి 14 వరకు హైదరాబాద్‌లో నిర్వహించిన భారత్ సమ్మిట్‌లో ఇటలీకి చెందిన యూరోపియన్ సోషలిస్ట్ పార్టీ నాయకుడు జియాకోమో ఫిలిబెక్ భారత రాజకీయాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని రామచందర్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రస్తావిస్తున్న ‘ఓట్ చోర్.. గద్దీ చోడ్’ నినాదాన్ని విదేశీ ప్రతినిధి ప్రస్తావించడం భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని విమర్శించారు.
ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో వేదికపై ఉన్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చప్పట్లు కొట్టడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవ్వడం కూడా అభ్యంతరకరమని ఆయన అన్నారు. దీనిపై ఇద్దరూ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టంలోని నిబంధనల ప్రకారం సదరు విదేశీ ప్రతినిధిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ కోరింది. ఇప్పటికే ఆయన దేశం విడిచి వెళ్లిపోయినందున తిరిగి రప్పించి విచారణ జరపాలని విజ్ఞప్తి చేసింది. అంతేకాకుండా, ఇలాంటి వ్యాఖ్యలకు వేదిక కల్పించిన సమ్మిట్ నిర్వాహకుల పాత్రపైనా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమం వెనుక విదేశీ నిధులు, దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ప్రయత్నాలు ఉన్నాయంటూ రామచందర్ రావు అనుమానాలు వ్యక్తం చేశారు. జార్జ్ సోరోస్ వంటి వ్యక్తుల నిధుల వ్యవహారంపైనా దర్యాప్తు జరగాలని కోరారు. మొత్తంగా భారత్ సమ్మిట్ వ్యాఖ్యల వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వివాదానికి తెరలేపింది. బీజేపీ చేసిన ఆరోపణలపై సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ALSO READ: Smartphone price hike | స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా?.. రూ.4 వేల వరకు పెరిగిన ధరలు!
