CM Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్(Singapore) పర్యటనలో భాగంగా అనేక కీలక చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రాన్ని టెక్నాలజీ, విద్యా రంగాల్లో గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆయన అంతర్జాతీయ సంస్థలతో చర్చలు కొనసాగిస్తున్నారు.ఈ పరిణామాల మధ్య గూగుల్ క్లౌడ్(Google Cloud) ఆసియా-పసిఫిక్ అధ్యక్షుడు కరణ్ బజ్వాతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్ మరియు డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హబ్‌గా అభివృద్ధి చేయడంపై ప్రధానంగా చర్చ జరిగింది. రాష్ట్రంలో ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ గవర్నెన్స్ రంగాల్లో గూగుల్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరుపక్షాలు అభిప్రాయాలు పంచుకున్నాయి.
ప్రభుత్వ సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా ప్రజలకు అందించేందుకు ఏఐ సాంకేతికతను వినియోగించుకోవాలని సీఎం సూచించారు. అలాగే రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థను ఆధునిక క్లౌడ్ టెక్నాలజీలతో మరింత సమర్థవంతం చేసే అంశంపై చర్చించారు. రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ టెక్నాలజీలలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని ప్రతిపాదించారు.
తరువాత సింగపూర్ జాతీయ విశ్వవిద్యాలయం (NUS) అధ్యక్షుడు టాన్ ఎంగ్ చేయ్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. అమరావతిని ప్రపంచ స్థాయి విద్యా కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఎన్‌యూఎస్ క్యాంపస్ లేదా శాటిలైట్ సెంటర్‌ను అక్కడ ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు.
అమరావతిలో నిర్మించనున్న క్వాంటం వ్యాలీ ప్రాజెక్టుకు ఎన్‌యూఎస్ సాంకేతిక సహకారం అందించాలని సీఎం కోరారు. గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకర్షించే విధానాల రూపకల్పనలో కూడా ఎన్‌యూఎస్ పాలసీ ఇనిస్టిట్యూట్ సహకారం తీసుకోవాలని సూచించారు.
ఈ సమావేశాల్లో ఎన్‌యూఎస్ ప్రతినిధులు అమరావతి అభివృద్ధి ప్రణాళికలపై ఆసక్తి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో సహకారంపై బోర్డులో చర్చిస్తామని హామీ ఇచ్చారు. ఈ భేటీలతో ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని స్పష్టమవుతోంది.








