Bangladesh Migrants: పశ్చిమ బెంగాల్ CM సువెందు అధికారి అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై కఠిన చర్యలు.. హోల్డింగ్ సెంటర్లు ఏర్పాటుపశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లా హకింపూర్ సరిహద్దు ప్రాంతంలో భారీగా ప్రజలు గుమిగూడిన ఘటన కలకలం రేపుతోంది. వీరిలో ఎక్కువ మంది అక్రమంగా భారత్‌లో నివసిస్తున్న బంగ్లాదేశ్ వలసదారులేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పలు నివేదికల ప్రకారం, ఈ గుంపు తిరిగి బంగ్లాదేశ్ వెళ్లేందుకు సరిహద్దు వద్ద వేచి ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అక్రమ చొరబాట్లపై “డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్” విధానాన్ని కఠినంగా అమలు చేయడం ప్రారంభించిన తర్వాత ఈ పరిస్థితి ఏర్పడిందని సమాచారం.
హకింపూర్ సరిహద్దులో కనిపించిన దృశ్యాలు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ సమయంలో కనిపించిన పరిస్థితులను తలపించాయి. డమ్‌డమ్ ప్రాంతంలో నివసిస్తున్నామని ఓ బంగ్లాదేశ్ వ్యక్తి మీడియాతో చెప్పినట్లు సమాచారం.
అనుమానిత అక్రమ విదేశీయులను ఉంచేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం హోల్డింగ్ సెంటర్లను ఏర్పాటు చేసింది. మాల్దా జిల్లాలో చందన్ పార్క్‌లో ఏర్పాటు చేసిన కేంద్రంలో ప్రస్తుతం మహిళలు, చిన్నారులు సహా అనుమానితులను ఉంచినట్లు అధికారులు తెలిపారు.
ఇక “డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్” విధానం ద్వారా అక్రమ వలసదారులపై చర్యలు కొనసాగుతున్నాయి. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్-2025 ప్రకారం పోలీసులు అనుమానితులను వారెంట్ లేకుండానే అరెస్ట్ చేసే అధికారం పొందారు.
ఈ చర్యలపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ నేతలు ఈ నిర్ణయాన్ని స్వాగతించగా, టీఎంసీ నేతలు మాత్రం ఇది ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ ఆధారంగా మాత్రమే అమలు కావాలని సూచించారు.








