AP Weather: ‘అర్నబ్’ తుఫాన్(Arnab cyclone) ప్రభావం నుంచి ఆంధ్రప్రదేశ్ ఇంకా పూర్తిగా కోలుకోకముందే మరో వాతావరణ హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న కొత్త అల్పపీడనం రాష్ట్రంపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ అప్రమత్తమైంది. భారత వాతావరణ శాఖ (IMD) సమాచారం ప్రకారం.. దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో కొత్తగా అల్పపీడనం ఏర్పడింది. ఇది వచ్చే 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా మారే సూచనలు ఉన్నాయి. అనంతరం మరో 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం దిశ, తీవ్రతలో వచ్చే మార్పులు ఏపీ తీర ప్రాంతాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
నవంబర్ 2, 3 తేదీల్లో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ‘అర్నబ్’ తుఫాన్ కారణంగా పంటలు దెబ్బతినడం, విద్యుత్ స్తంభాలు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త అల్పపీడనం మరింత బలపడితే పరిస్థితులు ఎలా ఉంటాయన్న ఆందోళన నెలకొంది. వాతావరణ శాఖ తాజా సూచనలను ప్రజలు గమనిస్తూ, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
ALSO READ: Janhvi Kapoor | అప్పుడే గట్టిగా మాట్లాడాల్సింది.. పెద్ది వివాదంపై జాన్వీ ఓపెన్ కామెంట్స్
