Cyclone Arnab: అర్నబ్ తుఫాన్ తీరం దాటడంతో కొంత ఉపశమనం లభించినా.. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు వాతావరణ ముప్పు ఇంకా కొనసాగుతోంది. యానాం–నరసాపురం మధ్య కోనసీమ సమీపంలో తుఫాన్ తీరాన్ని దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తీరం దాటే సమయంలో అతి తీవ్ర తుఫాన్ స్థాయి నుంచి తీవ్ర తుఫాన్‌గా బలహీనపడినప్పటికీ, పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు కొనసాగుతున్నాయి.
మరో 6 నుంచి 7 గంటలు కీలకం
తుఫాన్ భూమిపైకి చేరినప్పటికీ దాని ప్రభావం కొనసాగుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. రానున్న ఆరు నుంచి ఏడు గంటలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుఫాన్ కదలికలను, వాతావరణ మార్పులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
గోదావరి జిల్లాలకు భారీ వర్ష సూచన
అర్నబ్ ప్రభావంతో కోస్తాంధ్రలో వర్షాలు కొనసాగనున్నాయి. ముఖ్యంగా కోనసీమతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు వర్ష తీవ్రత కొనసాగవచ్చని హెచ్చరిస్తున్నారు. తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. బలమైన గాలులు వీచే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర ఆశ్రయం పొందకూడదు. అత్యవసర పరిస్థితులు మినహా బయటకు వెళ్లకుండా ఉండటం మంచిది. అధికారుల సూచనలను పాటిస్తూ, సహాయక బృందాలు అందించే సమాచారాన్ని గమనించాలని సూచించారు. తుఫాన్ తీరం దాటడం ఒక దశ ముగిసినట్టే అయినా, వర్షాలు, గాలుల ప్రభావం పూర్తిగా తగ్గేవరకు అప్రమత్తత అవసరం. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ అధికారుల సూచనలను పాటించాలి.
