ఆంధ్రప్రదేశ్ హోంగార్డులకు రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత(Home Minister Anitha) గుడ్ న్యూస్ తెలిపింది. హోంగార్డుల ఆరోగ్య భద్రత కోసం ప్రత్యేక ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా హోంగార్డులకు రూ.3 లక్షల నుంచి రూ.33 లక్షల వరకు ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో ప్రత్యేక హోంగార్డు ఆరోగ్య బీమా సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు.

రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. హోంగార్డుల కోసం ఇలాంటి ప్రత్యేక ఆరోగ్య భద్రతా పథకాన్ని ప్రారంభించిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 3,140 మంది హోంగార్డులకు లబ్ధి చేకూరనుంది.
తొలి విడతలో 975 మంది హోంగార్డులకు ఆరోగ్య బీమా సదుపాయం అందించనున్నారు. ముఖ్యంగా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా పూర్తిగా ఉచితంగా ఈ బీమా సౌకర్యాన్ని కల్పించడం విశేషం.
ఈ బీమా పథకం కింద హోంగార్డు కుటుంబ సభ్యులకు కూడా కవరేజ్ ఇవ్వనున్నారు. భర్త, భార్యతో పాటు ఇద్దరు పిల్లల వరకు ఆరోగ్య భద్రత వర్తించనుంది.
పోలీసు సిబ్బందికి ఉన్న ఆరోగ్య భద్రతా సౌకర్యాలు హోంగార్డులకు లేకపోవడం, వారి వేతనాలు తక్కువగా ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పథకం ద్వారా హోంగార్డులకు పెద్ద ఊరట లభించనుందని భావిస్తున్నారు.








