Matsyakara Bharosa scheme: ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. సముద్రంలో వేట నిషేధ కాలంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మత్స్యకార కుటుంబాలకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం భారీ సహాయాన్ని ప్రకటించింది. మత్స్యకార భరోసా పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.20,000 నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు.
ఈ ఏడాది వేట నిషేధం ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు మొత్తం 61 రోజుల పాటు అమల్లో ఉంటుంది. సముద్ర జీవసంపద పెంపుదల మరియు చేపల సంతానోత్పత్తిని దృష్టిలో ఉంచుకుని యాంత్రిక, మోటారు బోట్లతో వేటను పూర్తిగా నిషేధించారు. కేవలం సాంప్రదాయ పడవల ద్వారా తీర ప్రాంతాల్లో వేటకు మాత్రమే అనుమతి ఉంది.
ప్రభుత్వం ఈ పథకం కోసం సుమారు రూ.286 కోట్లు విడుదల చేయనుంది. గతంలో రూ.10,000గా ఉన్న సాయం ప్రస్తుతం రూ.20,000కి పెంచడం మత్స్యకారులకు పెద్ద ఊరటనిచ్చింది. మే 19 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. పేమెంట్ స్టేటస్‌ను egsws.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు.
గత ఏడాది సుమారు 1.30 లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందగా, ఈసారి కూడా అదే స్థాయిలో సహాయం అందనుంది. వేట నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రూ.5,000 జరిమానా, వలలు స్వాధీనం, బోటు లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు తీసుకోనున్నారు. అదనంగా డీజిల్ సబ్సిడీని లీటరుకు రూ.9కి పెంచడం, ప్రమాదంలో మరణించిన మత్స్యకార కుటుంబాలకు పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచడం ప్రభుత్వం తీసుకున్న మరో కీలక నిర్ణయం.








