Actress Gautami: తమిళ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు సీనియర్ నటి గౌతమి అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామికి ఆమె లేఖ రాశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సామాజిక సేవను మరింత సమర్థవంతంగా కొనసాగించాలనే ఉద్దేశంతో పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ప్రచార ఉపకార్యదర్శి పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
ఈ నిర్ణయాన్ని ఎంతో బాధతో తీసుకున్నానని, బరువెక్కిన హృదయంతో పార్టీని వీడుతున్నానని గౌతమి తన లేఖలో వెల్లడించారు. అన్నాడీఎంకేలో తన రాజకీయ ప్రయాణంలో తోడ్పాటునందించిన పార్టీ నాయకత్వం, మాజీ మంత్రులు, జిల్లా కార్యదర్శులు మరియు ఇతర నేతలకు గౌతమి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాల్లో గౌతమికి సుదీర్ఘ అనుభవం ఉంది. ఆమె దాదాపు రెండు దశాబ్దాలపాటు భారతీయ జనతా పార్టీలో చురుకుగా పనిచేశారు.
అయితే కొన్ని కారణాల వల్ల 2023లో బీజేపీకి రాజీనామా చేసి, అనంతరం 2024లో అన్నాడీఎంకేలో చేరారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోసం ఆమె ఆశించినప్పటికీ టికెట్ దక్కలేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే గౌతమి పార్టీకి దూరమయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె తదుపరి రాజకీయ అడుగు ఎలా ఉండబోతుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.








