PM Narendra Modi: దేశీయ చేనేత రంగానికి మరింత ప్రోత్సాహం కల్పించే దిశగా ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి ప్రజలకు ప్రత్యేక పిలుపునిచ్చారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని(National Handloom Day) పురస్కరించుకుని విడుదల చేసిన వీడియో సందేశంలో, ప్రతి భారతీయుడు చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నేతన్నల శ్రమకు గౌరవం తెలపడానికి ప్రతి కుటుంబం కనీసం ఒక్క చేనేత వస్త్రం లేదా ఉత్పత్తిని కొనుగోలు చేయాలని సూచించారు. 1905లో ప్రారంభమైన స్వదేశీ ఉద్యమం దేశంలో స్వావలంబనకు బాటలు వేసిందని గుర్తు చేసిన ప్రధాని, అదే స్ఫూర్తిని నేటి తరానికి చేనేత దినోత్సవం ద్వారా చాటాలని అన్నారు.
ఫ్రెండ్‌షిప్ డేను ఎంత ఉత్సాహంగా జరుపుకుంటామో, అదే ఉత్సాహంతో జాతీయ చేనేత దినోత్సవాన్ని కూడా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. చేనేత వస్త్రాలను వినియోగించడం ద్వారా నేతన్నల కుటుంబాలకు ఆర్థికంగా చేయూత అందించడంతో పాటు, ‘వోకల్ ఫర్ లోకల్’(Vocal for Local) మరియు ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యాలకు కూడా తోడ్పాటు అందించిన వారమవుతామని మోదీ పేర్కొన్నారు. దేశీయ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా భారతీయ చేనేత కళాకారుల జీవనోపాధికి బలం చేకూరుతుందని ఆయన వివరించారు.
ALSO READ: KTR | జాతీయ చేనేత దినోత్సవం.. నేతన్నలకు కేటీఆర్ శుభాకాంక్షలు








