Railway Fire Incident: బిహార్‌లోని సహర్సా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున సమస్తిపూర్–సహర్సా(Samastipur Saharsa) ప్యాసింజర్ రైలులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సిమ్రీ బఖ్తియార్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న సమయంలో ఇంజిన్‌కు ఆనుకుని ఉన్న బోగీలోని బ్యాటరీ బాక్స్ సమీపంలో మొదట పొగ కనిపించింది. కొద్ది నిమిషాల్లోనే మంటలు చెలరేగి బోగీని పూర్తిగా చుట్టుముట్టడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురై వెంటనే రైలు నుంచి బయటకు పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, ఆర్‌పీఎఫ్, జీఆర్‌పీ పోలీసులు, సిబ్బంది వేగంగా స్పందించి ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తరలించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని దాదాపు గంటన్నరపాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చింది.
ఈ ఘటనతో సహర్సా–సమస్తిపూర్ రైల్వే మార్గంలో సుమారు రెండు గంటల పాటు రైళ్ల రాకపోకలు స్తంభించిపోయాయి. పలు రైళ్లు మధ్యలో నిలిపివేయగా, మరికొన్నింటిని ఆలస్యంగా నడిపారు. మనిహారి–జయనగర్ జానకీ ఎక్స్‌ప్రెస్, కోసీ ఎక్స్‌ప్రెస్, దేవఘర్ ప్యాసింజర్ తదితర రైళ్ల సేవలు కూడా ప్రభావితమయ్యాయి. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై రైల్వే అధికారులు దర్యాప్తు చేపట్టారు.








