TB-Free Mission India: భారత్‌ను క్షయవ్యాధి (టీబీ) రహిత దేశంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ఆశించిన ఫలితాలను ఇస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. చండీగఢ్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ‘టీబీ ఫ్రీ ఇండియా’ కార్యక్రమం వేగంగా ముందుకు సాగుతోందన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా టీబీ చికిత్స సేవలు 90 శాతం వరకు ప్రజలకు చేరువయ్యాయని వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజా నివేదిక ప్రకారం గత పదేళ్లలో భారత్‌లో టీబీ వ్యాప్తి 21 శాతం తగ్గడం గర్వకారణమని పేర్కొన్నారు.
ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిరంతరం పెట్టుబడులు పెడుతోందని మోదీ చెప్పారు. 2014 తర్వాత దేశంలో 15 కొత్త ఎయిమ్స్‌లు ప్రారంభించడంతో పాటు వందల సంఖ్యలో మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశామని తెలిపారు. క్యాన్సర్ వంటి క్లిష్ట వ్యాధుల చికిత్స కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఖ్యను కూడా పెంచామని, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి వచ్చిందన్నారు.
ఆరోగ్య రక్షణలో పరిశుభ్రత కూడా కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ఈ లక్ష్యంతోనే స్వచ్ఛ భారత్ మిషన్‌ను అమలు చేశామని, దేశవ్యాప్తంగా కోట్లాది మరుగుదొడ్లు నిర్మించి బహిరంగ మలవిసర్జనను తగ్గించామని చెప్పారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెరగడం వల్ల అనేక అంటువ్యాధులను నియంత్రించగలిగామని ఆయన అభిప్రాయపడ్డారు.
ALSO READ: First Hydrogen Train | పొగ కాదు.. నీటి ఆవిరే! భారత్ తొలి హైడ్రోజన్ రైలు ప్రత్యేకతలివే








