Telangana Bonalu 2026: ఆషాఢ మాసం ప్రారంభం కావడంతో హైదరాబాద్ జంట నగరాలు భక్తి, సంప్రదాయాల సమ్మేళనమైన బోనాల వేడుకలకు సిద్ధమవుతాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, భక్తికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ ప్రతి ఏడాది నెల రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది జూలై 16న గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనుంది. అనంతరం జూలై 20 నుంచి 22 వరకు బల్కంపేట శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవాలు, ఆగస్టు 2న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో లష్కర్ బోనాలు ఘనంగా జరుగనున్నాయి. అన్నం, పాలు, పెరుగుతో వండిన నైవేద్యాన్ని మట్టి లేదా రాగి కుండలో అలంకరించి గ్రామదేవతకు సమర్పించడాన్ని బోనం అంటారు.
మహిళలు పసుపు, కుంకుమ, వేపాకులతో అలంకరించిన బోనాన్ని నెత్తిపై మోసుకుంటూ డప్పులు, మేళతాళాల నడుమ ఆలయాలకు తీసుకెళ్తారు. పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ వంటి గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ కుటుంబ సుఖశాంతి, ఆరోగ్యం కోసం మొక్కులు చెల్లిస్తారు.
వెయ్యేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి అధికారికంగా నిర్వహిస్తోంది. హైదరాబాద్‌లోని గోల్కొండ శ్రీ జగదాంబిక ఆలయంలో తొలి బోనం, బల్కంపేటలో రెండో బోనం, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో మూడో బోనం సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.








