Red Fort: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటకు బాంబు బెదిరింపు రావడంతో భద్రతా యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. ముంబై పోలీసుల కంట్రోల్ రూమ్‌కు వచ్చిన ఓ ఫోన్ కాల్‌లో ఎర్రకోటను పేల్చివేస్తామని హెచ్చరించడంతో వెంటనే సమాచారాన్ని ఢిల్లీ పోలీసులకు చేరవేశారు. దీంతో అత్యవసర చర్యలు చేపట్టిన అధికారులు ఎర్రకోట ప్రాంగణాన్ని పూర్తిగా ఖాళీ చేయించి సందర్శకులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఆ తర్వాత బాంబు నిర్వీర్య దళాలు, డాగ్ స్క్వాడ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రతి మూలను క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. సుదీర్ఘంగా కొనసాగిన తనిఖీల అనంతరం ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో ప్రమాదం లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రాథమిక విచారణలో ఈ బెదిరింపు బూటకమని తేలినప్పటికీ, కాల్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఉన్న ప్రాంతాల్లో ఎర్రకోట ఒకటి కావడంతో అధికారులు ఈ హెచ్చరికను అత్యంత సీరియస్‌గా తీసుకున్నారు.
ఇటీవల ఢిల్లీలో చోటుచేసుకున్న భద్రతా ఘటనల నేపథ్యంలో ఈ కాల్ మరింత ఆందోళనకు కారణమైంది. దీంతో రాజధానిలోని కీలక ప్రభుత్వ కార్యాలయాలు, పర్యాటక ప్రాంతాలు, రద్దీ ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం ఈ బెదిరింపు కాల్ వెనుక ఉన్న వ్యక్తులు లేదా ఉద్దేశ్యంపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.








