హైదరాబాద్ నగర అభివృద్ధిలో మరో కీలక అడుగు పడింది. మూసీ నదిని(Musi river) ఆధునిక ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు భారీ ఆర్థిక అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల నుంచి బాపూఘాట్ వరకు విస్తరించిన నదీ తీర ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయనున్నారు.
ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం జోన్-1ఏ, జోన్-1బీ పరిధిలో చేపట్టే నిర్మాణ పనుల కోసం రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఈ నిధులు ప్రధానంగా నిర్మాణ కార్యకలాపాల కోసం మాత్రమే వినియోగించనుండగా, భూసేకరణ ఖర్చులను ప్రత్యేకంగా భరిస్తారు. ప్రాజెక్టు వ్యయంలో ప్రధాన భాగమైన రూ.4,500 కోట్లను ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) నుంచి రుణంగా సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మిగిలిన రూ.2,845.12 కోట్లను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA), తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) ద్వారా సమకూర్చనున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టును ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కనస్ట్రక్షన్ (EPC) విధానంలో అమలు చేయనున్నారు. టెండర్ల ప్రక్రియ నుంచి పనుల పర్యవేక్షణ వరకు పారదర్శకత ఉండేలా ప్రత్యేక ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌ను కూడా నియమించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (MRDCL) పనులను వేగవంతం చేయనుంది.
ప్రాజెక్టు పూర్తయిన తర్వాత హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 9.20 కిలోమీటర్లు, ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 11.80 కిలోమీటర్ల నదీ తీర ప్రాంతం ఆధునిక వసతులతో కొత్త రూపును సంతరించుకోనుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు నగర సౌందర్యాన్ని పెంచే కీలక ప్రాజెక్టుగా ఇది నిలవనుందని అధికారులు భావిస్తున్నారు.
Musi river | మూసీకి మహార్దశ.. హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ కాదు.. ఇక మూసీనే కొత్త టూరిస్ట్ హబ్!
-








