మధుమేహ(Diabetes) చికిత్సలో భారత్ మరో కీలక ముందడుగు వేసింది. ప్రతిరోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవాల్సిన అవసరాన్ని తగ్గించే కొత్త తరహా బేసల్ ఇన్సులిన్ ఇప్పుడు భారత మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. డెన్మార్క్‌కు చెందిన ఔషధ సంస్థ నోవో నోర్డిస్క్ అభివృద్ధి చేసిన Awiqli (Insulin Icodec) అనే ఈ ఔషధం వారానికి కేవలం ఒక్కసారి మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. దీంతో ఏడాదికి 365 ఇంజెక్షన్లకు బదులుగా కేవలం 52 ఇంజెక్షన్లతోనే చికిత్స కొనసాగించే అవకాశం లభిస్తుంది. ఇన్సులిన్ అనేది శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషించే హార్మోన్.
టైప్-1 మధుమేహ రోగులకు ఇది తప్పనిసరి కాగా, కొంతమంది టైప్-2 మధుమేహ బాధితులకు కూడా వైద్యుల సూచన మేరకు ఇన్సులిన్ చికిత్స అవసరమవుతుంది. అయితే రోజూ ఇంజెక్షన్ తీసుకోవాల్సి రావడం వల్ల చాలామంది చికిత్సను వాయిదా వేస్తుంటారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ వీక్లీ బేసల్ ఇన్సులిన్ FlexTouch పెన్ ద్వారా వారానికి ఒకసారి మాత్రమే తీసుకోవచ్చు.
దీని వల్ల చికిత్సను క్రమం తప్పకుండా కొనసాగించడం సులభమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంజెక్షన్ల భయం ఉన్న రోగుల్లో చికిత్స పట్ల ఆసక్తి పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మధుమేహ భారం ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. కోట్లాది మంది ఈ వ్యాధితో జీవిస్తుండగా, మరెందరో ప్రీ-డయాబెటిస్ దశలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ ఇంజెక్షన్లతో సమర్థవంతమైన చికిత్స అందించే ఈ కొత్త విధానం వైద్య రంగంలో సానుకూల మార్పుకు దారితీయొచ్చని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
క్లినికల్ అధ్యయనాల్లో కూడా ఈ ఔషధం రక్తంలో చక్కెర నియంత్రణలో మంచి ఫలితాలు చూపినట్లు వెల్లడైంది. అయితే ఏ రకమైన ఇన్సులిన్ అయినా వైద్యుల సూచన మేరకే ఉపయోగించాలి. రోగులు స్వయంగా మందులు మార్చడం లేదా కొత్త చికిత్స ప్రారంభించడం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.








