ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన డిజిటల్ సేవలను మరింత సులభతరం చేయడానికి కీలక మార్పులు అమలు చేసింది. కొత్త టెక్నాలజీతో యూనిఫైడ్ మెంబర్ పోర్టల్‌ను అప్‌గ్రేడ్ చేసిన సంస్థ, కొన్ని ముఖ్యమైన సేవలను ఇకపై వెబ్‌సైట్‌లో కాకుండా కేంద్ర ప్రభుత్వానికి చెందిన UMANG యాప్ ద్వారా అందించాలని నిర్ణయించింది. దీంతో పీఎఫ్ సభ్యులు తమ ఖాతాలకు సంబంధించిన కొన్ని సేవలను కొత్త విధానంలో పొందాల్సి ఉంటుంది. ఈ మార్పుల్లో ముఖ్యంగా యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివేషన్ మరియు కొత్త UAN జనరేషన్ సేవలు ఇప్పుడు పూర్తిగా UMANG యాప్‌కు బదిలీ అయ్యాయి.
ఈ ప్రక్రియలో ఆధార్ ఆధారిత Face Authentication తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతో సభ్యుల గుర్తింపును మరింత కచ్చితంగా ధ్రువీకరించి మోసాలను నివారించాలనే ఉద్దేశంతో EPFO ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే PF ఖాతా ఉన్నా UAN పొందని సభ్యులు కూడా UMANG యాప్ ద్వారానే కొత్త UAN సృష్టించుకోవచ్చు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌తో లాగిన్ అయి అవసరమైన వివరాలు నమోదు చేసిన తర్వాత ఫేస్ అథెంటికేషన్ పూర్తి చేస్తే, కొత్త UAN జారీ అవుతుంది. అనంతరం అది ఇప్పటికే ఉన్న PF ఖాతాతో అనుసంధానం చేయబడుతుంది. దీంతో సభ్యుల నిధులు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతాయి.
యూఏఎన్‌ను మర్చిపోయిన సభ్యులకు కూడా EPFO కొత్త విధానంలో సౌలభ్యం కల్పించింది. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఓటీపీ ధ్రువీకరణ, అవసరమైన గుర్తింపు పత్రాలను సమర్పించడం ద్వారా UAN వివరాలను తిరిగి పొందే అవకాశం ఉంది. అయితే, డెత్ క్లెయిమ్ సేవల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. నామినీలు లేదా లబ్ధిదారులు ఇప్పటిలాగే EPFO పోర్టల్ ద్వారానే క్లెయిమ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం మరణ ధ్రువీకరణ పత్రం, బ్యాంక్ ఖాతా వివరాలు, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్ వంటి పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని EPFO సూచించింది.
ఈ మార్పులు ప్రస్తుతం ఉన్న PF బ్యాలెన్స్ లేదా UANపై ఎలాంటి ప్రభావం చూపవు. అయితే భవిష్యత్తులో సేవలను ఎలాంటి అంతరాయం లేకుండా వినియోగించాలంటే సభ్యులు తమ ఆధార్, KYC వివరాలు, మొబైల్ నంబర్ వంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు నవీకరించుకోవడం అవసరమని EPFO వెల్లడించింది.








