Tuesday, June 30, 2026
Chat on WhatsApp
HomeInterNationalEurope | యూరప్‌లో మండుతున్న ఎండలు.. 10 రోజుల్లో 1,300 మందికి పైగా.. ?

Europe | యూరప్‌లో మండుతున్న ఎండలు.. 10 రోజుల్లో 1,300 మందికి పైగా.. ?

-

Chat on WhatsApp

Europe: ఒకప్పుడు చల్లని వాతావరణానికి ప్రసిద్ధి చెందిన యూరప్‌ ఇప్పుడు తీవ్ర హీట్‌వేవ్‌తో సతమతమవుతోంది. పలు దేశాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటిపోవడంతో సాధారణ జనజీవనం తీవ్రంగా దెబ్బతింది. మండే ఎండలు, వేడి గాలులు, అధిక ఉక్కపోత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం గత పది రోజుల్లోనే 1,300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్‌తో పాటు యూరప్‌లోని అనేక దేశాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని దాటి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. జర్మనీలో 41.7 డిగ్రీలు, ఫ్రాన్స్‌లో 43.3 డిగ్రీలు, బ్రిటన్‌లో 38.8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణంగా వేసవిలో 20 నుంచి 27 డిగ్రీల మధ్య ఉండే ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరగడంతో ప్రజలు ఈ తీవ్ర వాతావరణాన్ని తట్టుకోలేకపోతున్నారు.

పగటిపూట మాత్రమే కాదు, రాత్రివేళల్లోనూ ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతుండటంతో ప్రజలకు ఉపశమనం లేకుండా పోయింది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి సమస్యలతో ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య భారీగా పెరగడంతో వైద్య సేవలపై తీవ్ర ఒత్తిడి నెలకొంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే యూరప్‌లో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. 2022 నుంచి హీట్‌వేవ్ ప్రభావం మరింత తీవ్రరూపం దాల్చగా, గత ఐదేళ్లలోనే సుమారు 60 వేల మంది ఎండల కారణంగా మరణించినట్లు అంచనాలు సూచిస్తున్నాయి. చల్లని వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మించిన భవనాలు వేడిని ఎక్కువసేపు నిల్వ చేసుకోవడం కూడా ప్రజల ఇబ్బందులను మరింత పెంచుతోందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp