Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక మంత్రిమండలి సమావేశానికి సిద్ధమైంది. రాష్ట్ర కేబినెట్ 34వ సమావేశాన్ని జూలై 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశం హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆరో అంతస్తులో ఉన్న కేబినెట్ సమావేశ మందిరంలో జరగనుంది. రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహణకు అవసరమైన పరిపాలనా ఆదేశాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు విడుదల చేశారు.
మంత్రివర్గ సమావేశం నేపథ్యంలో అన్ని శాఖల ఉన్నతాధికారులకు ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. సమావేశంలో చర్చించాల్సిన అంశాలను ముందుగానే సిద్ధం చేసి, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుగు అనువాదంతో కలిసి జూలై 1 మధ్యాహ్నం ఒంటి గంటలోపు జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలోని కేబినెట్ విభాగానికి పంపించాలని ఆదేశించింది.
ఏదైనా శాఖకు కేబినెట్ ముందుకు తీసుకురావాల్సిన ప్రతిపాదనలు లేకపోయినా, ‘నిల్ రిపోర్ట్’ను నిర్దేశిత గడువులోగా సమర్పించాలని స్పష్టం చేసింది. నిర్ణీత సమయానికి సమాచారం అందకపోతే అజెండా సిద్ధీకరణలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది.
అలాగే కేబినెట్ సమావేశం జరుగుతున్న సమయంలో అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు తమ హెడ్‌క్వార్టర్స్‌లోనే అందుబాటులో ఉండాలని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సమావేశంలో పలు కీలక పరిపాలనా, అభివృద్ధి, సంక్షేమ అంశాలపై ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే అవకాశముందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.








