Venezuela Earthquake: వెనిజులాలో వరుసగా సంభవించిన తీవ్ర భూకంపాలు దేశాన్ని అతలాకుతలం చేశాయి. శతాబ్దకాలంలో ఎన్నడూ లేనివిధంగా నమోదైన ఈ ప్రకృతి విపత్తు భారీ ప్రాణనష్టాన్ని మిగిల్చింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు ఐదు రోజులుగా కొనసాగుతున్న సహాయక చర్యల్లో ఇంకా మృతదేహాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
ఈ దుర్ఘటనలో అర్జెంటీనా ఫుట్‌బాల్ క్రీడాకారుడు లూకాస్ ట్రెజో తన కుటుంబాన్ని కోల్పోయిన ఘటన అందరినీ కలచివేసింది. వెనిజులా రెండో డివిజన్ క్లబ్ స్పోర్ట్ మారిటిమో లా గుయైరా తరఫున ఆడుతున్న ఆయన, భూకంపం సమయంలో కరాకస్‌లోని శిక్షణ కేంద్రంలో ఉన్నారు. సమాచారం అందగానే వెంటనే తన నివాసానికి చేరుకున్న ఆయనకు తీవ్ర షాక్ తగిలింది.
తీర ప్రాంతంలో ఉన్న ఆయన ఇల్లు పూర్తిగా కూలిపోవడంతో శిథిలాల గుట్టగా మారింది. తన భార్య యానినా, పిల్లలు ఆరోన్, ఐన్హోవా ప్రాణాలతో ఉండవచ్చన్న ఆశతో ట్రెజో మూడు రోజులపాటు స్వయంగా శిథిలాలను తొలగిస్తూ అన్వేషించారు. స్థానికులతో పాటు సోషల్ మీడియా ద్వారా కూడా భారీ యంత్రాల సహాయం కోసం విజ్ఞప్తి చేశారు. అయితే ఆదివారం నాటికి వారి మృతదేహాలు వెలుగులోకి రావడంతో ఆయన ప్రపంచం ఒక్కసారిగా కూలిపోయినట్లైంది. ఈ విషాద ఘటనపై క్లబ్ స్పోర్ట్ మారిటిమో లా గుయైరా తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, ట్రెజోకు అండగా ఉంటామని ప్రకటించింది.
ఇదిలా ఉండగా, అధికారిక సమాచారం ప్రకారం ఈ భూకంపాల్లో ఇప్పటివరకు 1,400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. విదేశీయులు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మొదటి 72 గంటల కీలక సమయం దాటిపోవడంతో శిథిలాల కింద చిక్కుకున్న వారిని సజీవంగా కాపాడే అవకాశాలు తగ్గుతున్నాయని రెస్క్యూ బృందాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ALSO READ: AIADMK | ఏఐఏడీఎంకేకి ఎదురుదెబ్బ.. పార్టీకి గుడ్‌బై చెప్పిన కరూర్ ఎమ్మెల్యే








