US Tariffs: విదేశీ దిగుమతుల విషయంలో అమెరికా కఠిన వైఖరి అవలంబించే సూచనలు వెలువడుతున్నాయి. ప్రపంచంలోని సుమారు 60 దేశాల నుంచి దిగుమతి అవుతున్న ఉత్పత్తులపై కొత్త సుంకాలు అమలు చేసే దిశగా అమెరికా ఆలోచిస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ఆయా దేశాల నుంచి అమెరికాకు వెళ్లే పలు ఉత్పత్తులపై 10 నుంచి 12.5 శాతం వరకు అదనపు పన్ను భారం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం ప్రకారం, కొన్ని దేశాల్లో తయారవుతున్న ఉత్పత్తుల్లో బలవంతపు కార్మిక వ్యవస్థ వినియోగంపై అనుమానాలు ఉన్నాయని పేర్కొంది. ఇలాంటి ఉత్పత్తులు అమెరికా మార్కెట్‌లోకి ప్రవేశించడం వల్ల అక్కడి పరిశ్రమలు, కార్మికులకు నష్టం కలుగుతోందని అమెరికా అభిప్రాయపడుతోంది. 1974 అమెరికా వాణిజ్య చట్టం కింద చేపట్టిన సమీక్షలో భారత్, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్‌డమ్ వంటి ప్రధాన వాణిజ్య భాగస్వాముల చర్యలపై ప్రశ్నలు తలెత్తినట్లు సమాచారం.
ముఖ్యంగా తక్కువ ధరలకు మార్కెట్‌లోకి వస్తున్న ఉత్పత్తులు స్థానిక కంపెనీల పోటీతత్వాన్ని దెబ్బతీస్తున్నాయని అమెరికా అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలపై చర్చలు కొనసాగుతున్న సమయంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ప్రతిపాదిత సుంకాలపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు.
జూలై 6 వరకు సంబంధిత దేశాలు, సంస్థల నుంచి అభిప్రాయాలను స్వీకరించనున్న అమెరికా ప్రభుత్వం, జూలై 7న ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించిన అనంతరం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనుంది.








