రిజర్వేషన్ వ్యవస్థపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓబీసీ కోటా అంశంపై సుప్రీంకోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ అధికారులుగా ఉన్నప్పటికీ వారికి రిజర్వేషన్ ప్రయోజనాలు ఎందుకు కొనసాగించాలన్న ప్రశ్నను జస్టిస్ బీ.వి. నాగరత్న లేవనెత్తారు. విద్య, ఆర్థిక స్థితి ద్వారా సామాజికంగా ఉన్నత స్థాయికి చేరుకున్న కుటుంబాలకు రిజర్వేషన్ అవసరంపై పునరాలోచన చేయాలని ఆమె అభిప్రాయపడ్డారు.
రిజర్వేషన్లు నిజంగా సమాజంలోని వెనుకబడిన, అట్టడుగు వర్గాలకే అందాలని కోర్టు స్పష్టం చేసింది. ఒకే కుటుంబం వరుసగా అవకాశాలను పొందితే, అదే వర్గంలోని నిజంగా వెనుకబడిన పేదలకు అన్యాయం జరుగుతుందా అనే అంశాన్ని కూడా పరిశీలించాలని సూచించింది.
ఈ సందర్భంగా కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఈ అంశంపై సమగ్రంగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఓబీసీ క్రీమీలేయర్ మరియు EWS కోటా మధ్య తేడా ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. EWS వర్గంలో సామాజిక వెనుకబాటుతనం లేకుండా కేవలం ఆర్థిక వెనుకబాటుతనం మాత్రమే ఉంటుందని జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు.
అందువల్ల, క్రీమీలేయర్ ప్రమాణాలను మరింత స్పష్టంగా నిర్వచించాల్సిన అవసరం ఉందని కోర్టు సూచించింది. అన్ని వర్గాలను ఒకే విధంగా చూడటం సరైన విధానం కాదని, వాస్తవంగా వెనుకబడిన వర్గాలకు మాత్రమే రిజర్వేషన్ ప్రయోజనాలు అందేలా వ్యవస్థ ఉండాలని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.








