Ebola variant: ఆఫ్రికా దేశమైన కాంగోలో ప్రమాదకరమైన ఎబోలా వైరస్(Ebola Virus) మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా ‘బుండిబుగ్యో’ అనే అరుదైన ఎబోలా వేరియంట్ వేగంగా వ్యాపిస్తూ భయాందోళన కలిగిస్తుంది. అధికారిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు వైరస్ బారిన పడి 134 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరో 500కుపైగా అనుమానిత కేసులు వెలుగులోకి రావడంతో స్థానిక ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఈ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఈ వైరస్ కొన్ని వారాల పాటు గుర్తించకుండా వ్యాప్తి చెందడం వల్ల పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. మొదట్లో సాధారణ ఎబోలా వైరస్‌గా భావించి పరీక్షలు నిర్వహించగా, ఫలితాలు నెగటివ్‌గా రావడంతో అధికారులు అప్రమత్తం కాలేకపోయారు. తర్వాత ఇది ‘బుండిబుగ్యో’ అనే భిన్నమైన వేరియంట్ అని గుర్తించారు.
ఈ అరుదైన వేరియంట్‌కు ప్రస్తుతం సమర్థవంతమైన వ్యాక్సిన్ లేదా ప్రత్యేక చికిత్స అందుబాటులో లేకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో కేసులు వేగంగా పెరుగుతుండటం, ఆరోగ్య సిబ్బంది కూడా వైరస్ బారిన పడటం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చుతోంది.
కాంగోలో పరిస్థితిని సమీక్షిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసుస్ అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రజల వలసలు, ఆరోగ్య సేవల బలోపేతం వంటి అంశాలపై చర్చ జరగనుంది.
ప్రస్తుతం ప్రపంచ దేశాలు కూడా ఈ వైరస్ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉన్నాయి. ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.








