Pakistan: పాకిస్తాన్‌లో ఇంధన సంక్షోభం రోజురోజుకూ తీవ్రమవుతోంది. దేశ అవసరాలకు సరిపడా చమురు, సహజ వాయువు అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వం గ్యాస్ వినియోగంపై కఠిన పరిమితులు అమలు చేస్తోంది.
ముఖ్యంగా కరాచీ నగరంలో రాత్రి 9 గంటల తర్వాత గ్యాస్ సరఫరాను పూర్తిగా నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో రోజంతా నిరంతరంగా గ్యాస్ అందుబాటులో ఉండగా, ప్రస్తుతం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కొద్ది గంటలపాటు మాత్రమే సరఫరా చేస్తున్నారు.
ఈ పరిస్థితుల కారణంగా ప్రజలు గ్యాస్ వచ్చే సమయానికే వంటలు చేసుకోవాల్సి వస్తోంది. ముఖ్యంగా మహిళలు వంట పనులను గ్యాస్ సరఫరా సమయాలకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నారు.
సాయంత్రం వేళల్లో టీ తయారు చేసుకోవడానికీ సమస్యలు ఎదురవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. గ్యాస్ అందుబాటుపైనే భోజన సమయాలు ఆధారపడటంతో కుటుంబాల దైనందిన జీవనం అస్తవ్యస్తమవుతోంది.
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, చమురు సరఫరాలో అంతరాయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్‌కు సంబంధించిన పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారితే పాకిస్తాన్‌లో ఇంధన కొరత ఇంకా తీవ్రమయ్యే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న పాకిస్తాన్‌కు ఈ ఇంధన సంక్షోభం మరింత భారంగా మారుతోంది.








