CM Vijay: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన CM విజయ్ వరుస సంచలన నిర్ణయాలతో చర్చనీయాంశంగా మారుతున్నారు. రాష్ట్రంలో మద్యం నియంత్రణపై దృష్టి సారించిన ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది.
సీఎం ఆదేశాల ప్రకారం గుడులు, మసీదులు, చర్చిలు, విద్యాసంస్థలు, బస్ స్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో కొనసాగుతున్న 717 టాస్మాక్ మద్యం దుకాణాలను వచ్చే రెండు వారాల్లో పూర్తిగా మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందులో ప్రార్థనా స్థలాల సమీపంలో 276 షాపులు, విద్యాసంస్థల వద్ద 186 షాపులు, బస్ టెర్మినల్స్ సమీపంలోని 255 షాపులు ఉన్నాయి. ఈ నిర్ణయంతో తమిళనాడులోని టాస్మాక్ షాపుల సంఖ్య 4,765 నుంచి 4,048కు తగ్గనుంది. ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా ఈ నిర్ణయం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక రాష్ట్రంలో 21 ఏళ్ల లోపు వారికి మద్యం విక్రయంపై ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేసింది. మద్యం కొనుగోలు చేసే వారి వయస్సుపై అనుమానం ఉంటే తప్పనిసరిగా గుర్తింపు కార్డులు తనిఖీ చేయాలని ఆదేశించారు. 21 ఏళ్ల లోపు వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం విక్రయించకూడదని స్పష్టం చేశారు.
ప్రస్తుతం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నడుస్తున్న మద్యం దుకాణాల సమయాన్ని రాత్రి 8 గంటల వరకే పరిమితం చేయాలన్న ప్రతిపాదనను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. మద్యం ద్వారా భారీ ఆదాయం వస్తున్నప్పటికీ, ప్రజా సంక్షేమమే ముఖ్యమనే దృక్పథంతో సీఎం విజయ్ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.








