Uttar Pradesh Storm: ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ తుపాను తీవ్రంగా దెబ్బతీసింది. నిన్న సాయంత్రం ఒక్కసారిగా విరుచుకుపడిన ఈ తుపాను వల్ల ఉరుములు, మెరుపులు, భారీ వర్షం, ధూళి తుపాను, వేగంగా వీచిన గాలులు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నష్టం కలిగించాయి.
ఇప్పటివరకు అధికారిక సమాచారం ప్రకారం 54 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. వందలాది చెట్లు నేలకూలగా, ఇళ్లు, గుడిసెలు ధ్వంసమయ్యాయి. విద్యుత్, రవాణా, సమాచార వ్యవస్థలు దెబ్బతినడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రయాగ్‌రాజ్ జిల్లాలో అత్యధికంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారు. భదోహీలో 15 మంది, మీర్జాపూర్‌లో 10 మంది, ఫతేపూర్‌లో 9 మంది మృతి చెందారు. హర్దోయి, కాన్పూర్ దేహత్, కౌశాంబి జిల్లాల్లో కూడా ప్రాణ నష్టం నమోదైంది. ప్రయాగ్‌రాజ్‌లోని అనేక ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. త్రివేణి సంగమం వద్ద యాత్రికుల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక గుడిసెలు కూడా గాలులకు నేలమట్టమయ్యాయి.
భదోహీలో పరిస్థితి మరింత విషాదకరంగా మారింది. ఖర్గసేన్‌పూర్ గ్రామంలో చెట్టు కూలి తల్లి మరియు ఆమె ముగ్గురు కుమార్తెలు మృతి చెందారు. బుదౌన్ జిల్లాలో గోడ కూలిన ఘటనలో ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. మరో ఘటనలో అన్షుల్ శర్మ అనే యువకుడు చెట్టు కూలి మృతి చెందాడు.
సహాయక బృందాలు ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా పనిచేస్తున్నాయి. అయితే మొబైల్, విద్యుత్ సేవలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి.
నష్టం అంచనా ఇంకా కొనసాగుతోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దెబ్బతిన్న మౌలిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు.








