Goods Train: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటన కలకలం రేపింది. వెంకటాచలం-మనుబోలు రైల్వే మార్గంలోని కొమ్మలపూడి జంక్షన్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
విజయవాడ నుంచి తిరుపతి వైపు వెళ్తున్న గూడ్స్ రైలు అకస్మాత్తుగా పట్టాలు తప్పడంతో రైల్వే అధికారుల్లో ఆందోళన నెలకొంది.
రైలుకు అనుసంధానంగా ఉన్న పాల ట్యాంకర్ బోగీ ట్రాక్‌పై అడ్డంగా పడిపోవడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనతో పలు రైళ్లు ఆలస్యంగా నడిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే సిబ్బంది, సాంకేతిక బృందాలు అక్కడికి చేరుకుని పునరుద్ధరణ పనులు ప్రారంభించాయి.
ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియలేదు. ట్రాక్‌లో సాంకేతిక లోపమా, లేక బోగీ సమస్యా అన్న దానిపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం. మార్గాన్ని త్వరగా పునరుద్ధరించేందుకు రైల్వే శాఖ చర్యలు చేపట్టింది.








