Solar Roof Cycling Track: హైదరాబాద్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్‌లో భాగంగా నిర్మించిన ఒక విభాగాన్ని అధికారులు తొలగించడం చర్చనీయాంశమైంది. నగర శివారులోని నార్సింగి సమీప మై హోమ్ అవతార్ జంక్షన్ వద్ద పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సుమారు 34 మీటర్ల మేర ఉన్న ట్రాక్‌ను తొలగించి, ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలు సులభతరం చేసేలా కొత్త యూ-టర్న్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.
ఔటర్ రింగ్ రోడ్ వెంబడి సుమారు 23 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన ఈ సోలార్ సైక్లింగ్ ట్రాక్ కోసం దాదాపు రూ.93 కోట్ల వ్యయం చేశారు. నగరంలో పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశారు. అయితే ట్రాఫిక్ ఒత్తిడి పెరగడంతో పోలీసుల సూచనల మేరకు మార్పులు చేపట్టినట్లు హెచ్‌ఎండీఏ, హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ వెల్లడించాయి. అధికారుల ప్రకారం, సైక్లిస్టుల ప్రయాణానికి పూర్తిగా అంతరాయం కలగదని, ట్రాక్‌కు బదులుగా అట్-గ్రేడ్ క్రాసింగ్ ద్వారా వారు సురక్షితంగా రాకపోకలు సాగించవచ్చని తెలిపారు. అయినప్పటికీ ఈ వివరణ సైక్లింగ్ వర్గాలను పూర్తిగా సంతృప్తి పరచలేదు.
హైదరాబాద్ సైకిల్ మేయర్‌గా పేరుగాంచిన ఎస్. సెల్వన్ ఈ చర్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూపొందించిన మౌలిక సదుపాయాలను క్రమంగా తగ్గించడం బాధాకరమని, వాహనాల కోసం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించకుండా సైకిల్ ట్రాక్‌లను తొలగించడం సరైన విధానం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని ఈ ట్రాక్ దేశవ్యాప్తంగా పలు నగరాలకు ఆదర్శంగా నిలిచిందని, అలాంటి ప్రాజెక్టును కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు.
Solar Roof Cycling Track | మై హోమ్ అవతార్ జంక్షన్‌లో సైకిల్ ట్రాక్ తొలగింపు.. కారణం ఇదే ?
-








