Chittoor Bird Flu: ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ మరోసారి కలవరపెడుతోంది. చిత్తూరు జిల్లా సదుం మండలంలోని పలు గ్రామాల్లో ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత వారం రోజులుగా కోళ్ల ఫారాల్లో కోళ్లు అకస్మాత్తుగా మృతి చెందుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం ఇప్పటివరకు దాదాపు “28 వేల కోళ్లు బర్డ్ ఫ్లూ(Bird Flu) కారణంగా మృతి చెందినట్లు” నిర్ధారించారు.
వ్యాధి ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండేందుకు రెవెన్యూ, పశుసంవర్ధక శాఖ అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. ఇప్పటికే మూడు కోళ్ల ఫారాలను సీజ్ చేసి, మిగిలి ఉన్న కోళ్లను కూడా నిర్మూలించే ప్రక్రియను ప్రారంభించారు. గ్రామాల పరిధి వెలుపల జేసీబీల సహాయంతో భారీ గుంతలు తవ్వి, “శాస్త్రీయ విధానంలో కోళ్లను పూడ్చిపెడుతున్నారు”.
ఈ విషయమై స్పందించిన స్థానిక ఎమ్మార్వో మాట్లాడుతూ, వ్యాధి సోకిన ఫారాలను వెంటనే మూసివేశామని తెలిపారు. ప్రజలు ఆ ప్రాంతాలకు వెళ్లకుండా ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు. ప్రజారోగ్య భద్రతే ప్రధాన లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కోళ్ల వ్యర్థాలను ఎక్కడైనా పడేయకుండా జాగ్రత్తలు పాటించాలని, అధికారులకు సహకరించాలని ప్రజలకు సూచించారు.








