ఎర్రకోట పేలుడు ఘటనాస్థలాన్ని పరిశీలించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

ఢిల్లీ ఎర్రకోట సమీపంలో కారు పేలుడు ఘటన తర్వాత ఘటనాస్థలిని పరిశీలిస్తున్న అమిత్ షా

దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో భారీ కారు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, మరో 20 మందికి గాయాలు అయ్యాయి. హ్యుందాయ్ ఐ20 కారులో జరిగిన ఈ పేలుడు ప్రాంతాన్ని ఒక్కసారిగా దద్దరిల్లించింది. సమాచారం అందగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెంటనే ఘటనాస్థలికి చేరుకుని అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు.

గాయపడిన వారిని తరలించిన లోక్‌నాయక్ ఆసుపత్రిని ఆయన సందర్శించి, బాధితులను పరామర్శించారు. అనంతరం ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీశ్ గోల్చాతో సమావేశమై ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఎన్‌ఐఏ, ఫోరెన్సిక్ బృందాలు రంగంలోకి

అమిత్ షా మాట్లాడుతూ, “ఈరోజు సాయంత్రం 7 గంటల సమయంలో ఎర్రకోట సమీపంలోని సుభాష్ మార్గ్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న హ్యుందాయ్ ఐ20 కారులో పేలుడు సంభవించింది.

ఈ పేలుడు ధాటికి పాదచారులు గాయపడ్డారు, సమీపంలోని వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం కొందరు ప్రాణాలు కోల్పోయారు” అని తెలిపారు.

సమాచారం అందిన 10 నిమిషాల్లోనే ఢిల్లీ పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయని చెప్పారు. “జాతీయ దర్యాప్తు సంస్థ (NIA), ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL) బృందాలు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించాయి.

ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను విశ్లేషిస్తున్నాం” అని ఆయన వెల్లడించారు.

ప్రజలకు దర్యాప్తు వివరాలు వెల్లడిస్తాం

ఈ దాడి వెనుక ఉన్న మూలాలను కనుగొనడంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని అమిత్ షా హామీ ఇచ్చారు. “దర్యాప్తు పూర్తయ్యాక అన్ని వివరాలను ప్రజల ముందు ఉంచుతాం. బాధ్యులెవరో తేలుస్తాం” అని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *