Virat Kohli – Anushka Sharma: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, సినీ నటి అనుష్క శర్మ ఆధ్యాత్మికతపై తమ నమ్మకాన్ని మరోసారి చూపించారు. గురు పౌర్ణమి సందర్భంగా బృందావన్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన విరాట్-అనుష్కలు, సంత్ ప్రేమానంద్ మహారాజ్‌ను కలసి ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు అందుకున్నారు. శ్రీ హిత్ రాధా కేలి కుంజ్ ఆశ్రమంలో జరిగిన ఈ దర్శనానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ పర్యటనలో విరాట్, అనుష్కల సాదాసీదా వ్యవహారం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆశ్రమానికి వెళ్లే మార్గంలో బురదతో ఉన్న దారిలో వారు చెప్పులు లేకుండా నడుస్తూ కనిపించారు. కోట్లాది మంది అభిమానులను కలిగిన సెలబ్రిటీలైనప్పటికీ ఎలాంటి హంగూ ఆర్భాటాలకు తావివ్వకుండా సాధారణ భక్తుల్లా వ్యవహరించడం నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.
ఆశ్రమంలో దర్శనం అనంతరం బయటకు వచ్చిన విరాట్, అనుష్క అక్కడ ఉన్న భక్తులను ఆప్యాయంగా పలకరించారు. చిరునవ్వుతో “రాధే-రాధే” అంటూ అభివాదం చేయడంతో అక్కడి వారు ఆనందం వ్యక్తం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ గత కొంతకాలంగా బృందావన్‌కు తరచూ వెళ్తున్నారు. జీవితంలోని ముఖ్యమైన సందర్భాల్లో ఆధ్యాత్మిక గురువుల ఆశీస్సులు పొందడం వారికి అలవాటుగా మారింది. క్రికెట్ టోర్నీలు, వ్యక్తిగత నిర్ణయాల సమయంలోనూ వారు ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా వీడియోపై అభిమానులు స్పందిస్తూ.. విజయాలు, స్టార్ స్టేటస్ ఉన్నప్పటికీ వినయంగా ఉండటం విరాట్, అనుష్క ప్రత్యేకత అని ప్రశంసిస్తున్నారు.








