అమెరికాలో నివసిస్తున్న వలసదారులకు షాక్‌లాంటి నిర్ణయం తీసుకుంది ట్రంప్ ప్రభుత్వం. సుమారు 6 వేల మంది జీవించి ఉన్నప్పటికీ, అధికారిక రికార్డుల్లో వారిని మృతులుగా నమోదు చేసింది. దీంతో వారి సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఆటోమేటిక్‌గా రద్దయింది. ఈ నెంబర్ లేకుండా అమెరికాలో జీవించడం అసాధ్యం.
సోషల్ సెక్యూరిటీ నెంబర్ అనేది అమెరికాలో పౌరులకు మాత్రమే కాదు, తాత్కాలికంగా ఆశ్రయం కోరిన వలసదారులకు కూడా అవసరం. ఇది లేనిదే వారు ప్రభుత్వ సేవలు పొందలేరు, ఉద్యోగం చేయలేరు. ఇలా రికార్డుల్లో చనిపోయిన వారిగా ముద్ర వేయడం వల్ల వారు తాము జీవించి ఉన్నా ఎలాంటి లబ్ధి పొందలేరు.
ఇది వలసదారులపై ఒత్తిడి పెంచేందుకు తీసుకున్న వ్యూహంగా భావిస్తున్నారు. ‘పొమ్మన లేక పొగ బెట్టినట్లు’ అని తెలుగు సామెత చెప్పినట్లు, ట్రంప్ సర్కారు నేరుగా పంపించలేక రికార్డుల్లో చంపేసి అటు నిబంధనలు, ఇటు ఒత్తిడితో వలసదారులను స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని ప్రేరేపిస్తోంది.
ఇదే సమయంలో బైడెన్ ప్రభుత్వ కాలంలో 90 వేల మందికిపైగా తాత్కాలిక ఆశ్రయంతో అమెరికా ప్రవేశించారని అధికారులు వెల్లడించారు. గడువు ముగిసిన తర్వాత కూడా వెనక్కి వెళ్లని వారిని గుర్తించేందుకు సమయం, వనరులు లేకపోవడంతో ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ చర్య మానవతా విలువలకు విరుద్ధమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.