BRICS Summit 2026: అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలకు వేదికగా నిలవనున్న బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సు ఈ ఏడాది సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూదిల్లీలో జరగనుంది. ఐదేళ్ల తర్వాత భారత్‌లో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు ప్రపంచంలోని ప్రముఖ దేశాధినేతలు హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ఈ సమావేశానికి వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
సదస్సు సందర్భంగా ఆయా దేశాల నేతలు ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేక ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. ఈసారి బ్రిక్స్ సమావేశానికి “స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిర అభివృద్ధి కోసం నిర్మాణం” అనే ప్రధాన అంశాన్ని ఖరారు చేశారు. సభ్య దేశాల మధ్య ఆర్థిక, రాజకీయ, దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ప్రధానంగా చర్చలు జరగనున్నాయి.
బ్రిక్స్ వేదికగా మోడీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి
షీ జిన్‌పింగ్ భారత్‌కు వస్తే, 2019 అక్టోబర్ తర్వాత ఆయనకు ఇదే తొలి భారత పర్యటన కానుంది. అప్పట్లో తమిళనాడులోని మామల్లపురంలో ప్రధాని మోడీతో ఆయన అనధికారిక సమావేశం నిర్వహించారు. అయితే అనంతరం లడాఖ్‌లోని వాస్తవాధీన రేఖ (LAC) వద్ద చైనా బలగాల కదలికల కారణంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. 2024లో సరిహద్దు సమస్య పరిష్కార దిశగా చర్చలు జరగడంతో సంబంధాల్లో కొంత సానుకూల మార్పు వచ్చింది. తర్వాత రష్యాలోని కజాన్‌లో జరిగిన సమావేశంలో మోడీ, జిన్‌పింగ్ చర్చలు జరిపారు. అలాగే 2025లో చైనాలోని టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సు సందర్భంగా ఇద్దరు నేతలు మరోసారి సమావేశమయ్యారు.
బ్రిక్స్‌పై పశ్చిమాసియా ప్రభావం
ఈసారి బ్రిక్స్ సదస్సులో పశ్చిమాసియా పరిణామాలు కూడా ప్రధాన చర్చగా మారే అవకాశం ఉంది. 2024లో బ్రిక్స్‌లో చేరిన ఇరాన్, యూఏఈ దేశాలు ప్రాంతీయ సమస్యలపై భిన్న వైఖరులను కలిగి ఉన్నాయి. పాలస్తీనా అంశం, మధ్యప్రాచ్య శాంతి ప్రక్రియపై బ్రిక్స్ ఉమ్మడి ప్రకటనలో చేర్చాల్సిన అంశాలపై సభ్య దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సభ్య దేశాల మధ్య సమన్వయం తీసుకురావడంలో భారత్ కీలక పాత్ర పోషించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇరాన్‌తో సంబంధాల బలోపేతంపై చర్చలు
ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ భారత పర్యటన సందర్భంగా పశ్చిమాసియా పరిస్థితులతో పాటు భారత్–ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా చాబహార్ పోర్టు అభివృద్ధి, వాణిజ్య సంబంధాల విస్తరణ అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అమెరికా ఆంక్షల కారణంగా 2019 నుంచి భారత్ ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతులను నిలిపివేసిన విషయం తెలిసిందే. బ్రిక్స్ సభ్య దేశాలతో పాటు కొన్ని ఇతర దేశాల నేతలను కూడా భారత్ ఈ సదస్సుకు ఆహ్వానిస్తోంది. బిమ్‌స్టెక్ అధ్యక్ష దేశంగా ఉన్న బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రహ్మాన్‌కు కూడా ఆహ్వానం పంపినట్లు సమాచారం.
ALSO READ: Lenin | అయ్యగారికి అదిరిపోయే బ్లాక్‌బస్టర్.. 100 కోట్ల క్లబ్ లో లెనిన్








