Donald Trump: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ సైనిక లక్ష్యాలను దాదాపు చేరుకున్నామని, ఇరాన్‌పై కొనసాగుతున్న సైనిక చర్యను క్రమంగా ముగించే అవకాశంపై ఆలోచిస్తున్నామని ట్రంప్ తెలిపారు.
అయితే దీనర్థం కాల్పుల విరమణ కాదని ఆయన స్పష్టం చేశారు. ట్రూత్ సోషల్ వేదికగా చేసిన పోస్టులో, అమెరికా దాడులతో ఇరాన్ క్షిపణి సామర్థ్యాలు, వైమానిక మరియు నావికా వ్యవస్థలకు తీవ్రమైన నష్టం కలిగించామని పేర్కొన్నారు.
ఇరాన్ మరోసారి అణ్వాయుధ తయారీ దిశగా అడుగులు వేయకుండా తాము కట్టడి చేస్తామని కూడా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు యుద్ధం తగ్గింపు దిశగా సంకేతాల్లా కనిపించినా, పూర్తి శాంతి చర్చలకు మాత్రం అమెరికా ఇంకా సిద్ధంగా లేదనే సంకేతం ఇస్తున్నాయి.
ఇక పశ్చిమాసియాలోని అమెరికా మిత్రదేశాల భద్రతపై కూడా ట్రంప్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్, కువైట్ వంటి దేశాలకు అత్యున్నత స్థాయిలో రక్షణ కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ఇదే సమయంలో హర్ముజ్ జలసంధి భద్రతపై ఆధారపడిన దేశాలే నౌకాయాన రక్షణ బాధ్యత తీసుకోవాలని ట్రంప్ పిలుపునిచ్చారు.
అమెరికా ప్రత్యక్షంగా ఆ బాధ్యత తీసుకోదని, అవసరమైతే మాత్రం సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటామని చెప్పారు. ఈ ప్రకటన గల్ఫ్ ప్రాంత భద్రతా సమీకరణాలపై కొత్త చర్చకు దారితీసింది.
అయితే ట్రంప్ ఒకవైపు యుద్ధాన్ని తగ్గించే అవకాశాన్ని ప్రస్తావిస్తుండగా, మరోవైపు అమెరికా అదనపు సైనిక దళాలను మధ్యప్రాచ్యానికి పంపుతున్నట్లు రాయిటర్స్, ఏపీ నివేదించాయి. వేలాది మెరైన్లు, నౌకాదళ బలగాలు ఇప్పటికే ప్రాంతానికి మోహరించబడుతున్నాయి.
దీంతో అమెరికా వ్యూహం ద్వంద్వ స్వరూపంలో ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవైపు యుద్ధం ముగింపుపై సంకేతాలు ఇస్తూనే, మరోవైపు ప్రాంతీయ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు సన్నద్ధమవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ముఖ్యంగా హర్ముజ్ జలసంధి, ఇంధన సరఫరా మార్గాల భద్రత అంతర్జాతీయ రాజకీయాల్లో మరింత కీలకంగా మారింది.








