Jeevan Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి నిర్ణయం చుట్టూ తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. పార్టీ మారతారన్న ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో ఆయనను బుజ్జగించేందుకు కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్, ఎమ్మెల్యే సత్యం ఆయనతో సమావేశమయ్యారు. గంటకుపైగా జరిగిన ఈ భేటీలో జీవన్‌రెడ్డి తన మనసులోని ఆవేదనను స్పష్టంగా వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీలో నాలుగు దశాబ్దాలుగా పని చేస్తున్నా తగిన గౌరవం దక్కడం లేదనే భావనను ఆయన మంత్రుల ఎదుట వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ పరిణామం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
భేటీ అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ జీవన్‌రెడ్డి చాలా కాలంగా పార్టీకి సేవలందిస్తున్న సీనియర్ నాయకుడని తెలిపారు. ఆయనతో పలు అంశాలపై చర్చించినట్లు, వ్యక్తం చేసిన ఆవేదనను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
జీవన్‌రెడ్డి లాంటి అనుభవజ్ఞుల అభిప్రాయాలను పార్టీ సీరియస్‌గా పరిగణిస్తుందని కూడా పేర్కొన్నారు. అయితే ఈ భేటీ ద్వారా పరిస్థితి సర్దుకుంటుందని భావించిన వారికి జీవన్‌రెడ్డి స్పందన మరింత ఉత్కంఠను పెంచింది.
సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన జీవన్‌రెడ్డి, తన నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం పూర్తి వివరాలు వెల్లడించకపోయినా, రేపు తన తదుపరి చర్యలపై స్పష్టత ఇస్తానని చెప్పారు.
దీంతో ఆయన పార్టీ మార్పు దిశగా అడుగులు వేస్తున్నారా? లేక ఇతర రాజకీయ నిర్ణయం తీసుకోబోతున్నారా? అన్న చర్చ రాజకీయ వర్గాల్లో మరింత వేడెక్కింది. కాంగ్రెస్‌లో తన స్థానం, గౌరవం, భవిష్యత్ పాత్రపై అసంతృప్తి ఉందనే సంకేతాలు ఆయన వ్యాఖ్యల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేపు జీవన్‌రెడ్డి చేసే ప్రకటన తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశముంది.








