ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu), మంత్రి నారా లోకేష్ ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ నాయకులు ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు, టంగుటూరి ప్రకాశం పంతులు తెలుగువారి ధైర్యసాహసాలకు, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని తెలిపారు. అచంచల దేశభక్తి, నిజాయితీ, నిబద్ధతతో ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని ఆయన పేర్కొన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు.
మంత్రి నారా లోకేష్ కూడా టంగుటూరి ప్రకాశం పంతులు సేవలను కొనియాడుతూ నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన నేతగా ఆయనను గుర్తుచేశారు. ధైర్యసాహసాలు, ప్రజాసేవ, దేశభక్తికి ఆయన ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు.
స్వాతంత్ర్య పోరాటం నుంచి రాష్ట్ర నిర్మాణం వరకు ఆయన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. ఆయన ఆశయ సాధనకు అందరూ పునరంకితం కావాలని లోకేష్ పిలుపునిచ్చారు.








