Tamil Nadu election results: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠగా మారుతున్నాయి. ప్రారంభ అంచనాలు తారుమారవుతూ, రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ డీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తుందని సూచించినప్పటికీ, ప్రస్తుత ట్రెండ్స్ మాత్రం భిన్నంగా కనిపిస్తున్నాయి.
ప్రముఖ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అనూహ్యంగా ముందంజలోకి రావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది.
ప్రస్తుతం లభిస్తున్న సమాచారం ప్రకారం టీవీకే అభ్యర్థులు సుమారు 113 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, అన్నాడీఎంకే 71, డీఎంకే 51 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ప్రారంభంలో వెనుకబడిన టీవీకే, క్రమంగా ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ ఆధిక్యం పెంచుకుంటూ రావడం విశేషం. దీంతో మూడు ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది.
ఈ పరిణామాలతో తమిళనాడులో స్పష్టమైన మెజార్టీ రాకపోయే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అదే జరిగితే ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర టీవీకేకు దక్కే అవకాశముంది. ఈ నేపథ్యంలో విజయ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలపై చర్చలు జోరుగా సాగుతున్నాయి.
మరోవైపు టీవీకే ఆధిక్యం మరింత పెరిగితే స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలను కూడా కొందరు సూచిస్తున్నారు. మొత్తంగా తమిళనాడు రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి.








