Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. ఇరాన్ ఓడరేవులపై దీర్ఘకాల దిగ్బంధనాన్ని కొనసాగించాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం పెట్టుబడిదారుల్లో ఆందోళనను పెంచింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. బ్రెంట్ క్రూడ్ ధర ఒక దశలో 110 డాలర్ల స్థాయికి చేరింది.
దేశీయ మార్కెట్లపై కూడా ప్రతికూల ప్రభావం పడింది. రూపాయి విలువ బలహీనపడటం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన నెగటివ్ సంకేతాలు సూచీలపై ఒత్తిడిని పెంచాయి. రోజంతా ఒడిదుడుకులకు లోనైన సెన్సెక్స్ ఒక దశలో వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోయింది.
చివరికి 582 పాయింట్ల నష్టంతో 76,913 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 180 పాయింట్లు కోల్పోయి మళ్లీ 24 వేల దిగువకు జారుతూ 23,997 వద్ద స్థిరపడింది.
మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈ మార్కెట్ విలువ కూడా భారీగా తగ్గింది. సుమారు రూ.5 లక్షల కోట్ల మేర ఆస్తి విలువ తగ్గి రూ.469 లక్షల కోట్ల నుంచి రూ.464 లక్షల కోట్లకు పడిపోయింది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 4,634 డాలర్ల వద్ద కొనసాగుతోంది. రూపాయి విలువ ఒక దశలో 95 స్థాయిని దాటి, చివరికి 94.90 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో ఎల్ అండ్ టీ, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ వంటి షేర్లు నష్టపోగా, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా వంటి షేర్లు లాభాల్లో నిలిచాయి.








