Kavitha: తెలంగాణ రక్షణ సేన (TRS) పేరుకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిన నేపథ్యంలో కవిత హర్షం వ్యక్తం చేశారు. ఈసీ నిబంధనలకు అనుగుణంగా జనవరిలో మొత్తం ఐదు పేర్లతో దరఖాస్తు చేసుకున్నామని, అందులో మూడో ప్రాధాన్యంగా ఇచ్చిన పేరును ఆమోదించిందని ఆమె తెలిపారు. “టీఆర్‌ఎస్ పేరు నాకు రాసిపెట్టి ఉందేమో” అంటూ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రెండు దశాబ్దాలుగా తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ, రాష్ట్ర పునరుజ్జీవం కోసం చేస్తున్న కృషిని కొనసాగిస్తానని ఆమె ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. రాష్ట్ర అస్తిత్వ పరిరక్షణే తమ ప్రధాన ధ్యేయమని, దానికి అంకితభావంతో పనిచేస్తానని కవిత స్పష్టం చేశారు.
ఈ నెల 25న కవిత ప్రకటించిన కొత్త రాజకీయ పార్టీ పేరుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ఆమోదముద్ర వేసింది. మొదట “తెలంగాణ రాష్ట్ర సేన” పేరును ప్రతిపాదించినప్పటికీ, చివరికి “తెలంగాణ రక్షణ సేన” పేరును ఈసీ ఆమోదించింది.
బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి ఎన్నికల సంఘం అధికారులు వెళ్లి అధికారిక లేఖను అందజేశారు. పార్టీ పేరుపై పత్రికల్లో ప్రకటన ఇవ్వాలని సూచించారు. అలాగే కొత్త పార్టీ పేరుపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లోగా ఈసీకి తెలియజేయాలని స్పష్టం చేశారు.








