Telangana Formation Day: తెలంగాణ రాష్ట్ర 12వ అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించారు. పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం మరియు అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కృషి చేసిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీకి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. కాళోజీ స్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజలు రాచరికాన్ని, పెత్తన రాజకీయాలను అంగీకరించరని వ్యాఖ్యానించారు.
విద్యారంగంలో ఇప్పటికే 1362 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభించామని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో అల్పాహార పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. జూనియర్ కళాశాల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అందిస్తున్నట్లు వెల్లడించారు.
ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం పారదర్శక విధానాన్ని అనుసరిస్తోందని సీఎం పేర్కొన్నారు. ఇప్పటివరకు 67 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేశామని, ఈ నెలలోనే TGPSC ద్వారా ఇంజినీరింగ్, పీసీబీ, అటవీ, టౌన్ ప్లానింగ్, విద్యాశాఖలకు సంబంధించిన కొత్త నోటిఫికేషన్లు విడుదల కానున్నాయని ప్రకటించారు.
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొంటూ, రూ.2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేశామని తెలిపారు. దాదాపు 25 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరిందని వెల్లడించారు. రైతు భరోసా పథకం కింద వేల కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించారు.
మహిళల ఆర్థిక సాధికారత కోసం కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం తెలిపారు. మహిళలకు భారీ స్థాయిలో రుణాలు అందించి వారిని పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహిస్తామని చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా మహిళలు ఇప్పటికే వేల కోట్ల రూపాయల ప్రయోజనం పొందారని పేర్కొన్నారు.








